Friday, December 10, 2010

ఈగ

హేరిస్ ఒక నిగ్గరు.
మనిషి కాదు.
నిగ్గరు అంటే నిగ్గరే.
వాడెవరని?
వాడికి వివరణ ఏం చెప్పగలం? వాడు బానిస పని చేయడానికి పుట్టిన వాడు.
మనుష్యజాతి బానిసత్వం
చేయించుకునేది.
నిగ్గరు జాతి చేసేది.

అయ్యయ్యో అలా మాట్లాడుతారేమిటి? అందరూ మనుషులు ఎలా అవుతారసలు? ఇప్పుడూ... పులి చిరుత పిల్లి ఉన్నాయి. వర్ణం, వేగం, పరిమాణం ఒకింత తేడా అంతేగా? అంతమాత్రాన మూడూ ఒకటే అనం. ఒకే జీవకుటుంబం అని మాత్రం పాఠ్య పుస్తకాలు చెప్తాయి. అచ్చం అలాగే మనుషులు నిగ్గర్లు ఒకే జీవకుటుంబం కావచ్చు. కానీ ఒకటే జాతి మాత్రం... కచ్చితంగా కాదు.

హేరిస్ నికార్సయిన నిగ్గరు. కొంచెం కూడా కల్తీ ఉండదు. అంటే... అతని వంశంలో ముందు తరాల ఆడవాళ్లు ఎవ్వరికీ, మనుషులు అనే తెల్లదొరల్తో కల్తీ జరిగి ఉండలేదు. బాగా కాలిన చింతబొగ్గులా నిగనిగలాడుతూ ఉంటాడు. రంగు వెలిసిన రింగు రింగుల జుత్తు తలను అంటిపెట్టుకుని కురచగా ఉంటుంది. దూడ పెదాలు, బండబారిన ఒళ్లు.

అతని ఆలోచనల్లో కూడా కల్తీ లేదు. నికార్సుగా బానిస పని చేయడం మినహా అతడి ఆలోచనలో మరోటి ఉండేది కాదు. యజమాని పిలిచి పురమాయించక ముందే పని ఏంటో అర్థం చేసుకుని అల్లుకుపోయేవాడు. ప్రభువు మనసెరిగి ప్రవర్తించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. మన్నించాలి. వెన్న అతనికి తెలియని వస్తువు. మహా అయితే ఉగ్గుపాలతో అబ్బిన విద్య.

సుమారు నూటయాభై ఏళ్ల కిందటి ఒక బతుకు గురించి ఇప్పుడు చర్చించుకోవడం అవసరమా అనిపించవచ్చు? తప్పేముంది. నిజానికి కొన్ని బతుకులు అంతే. అవి ధీరోదాత్త కథానాయకులకు సంబంధించినవి కాకపోయినా... అవి ఎందుకూ కొరగాని చిల్లర బతుకులే అయినా... కొన్ని తరాల వరకు చర్చకు పాత్రంగానే ఉంటాయి. ఒకవేళ, అందులో నిజంగా ఏమైనా విషయం ఉంటే, మనం తెలుసుకోవచ్చు.

ఇక్కడ ఒక సంగతి ప్రస్తావించాలి. హేరిస్ అనగానే... కొందరికి స్తోవే ।అంకుల్ టామ్స్ కేబిన్*లోని హేరిస్ గుర్తుకు రావచ్చు. పేర్లు ఒకటే. వాడు కూడా నిగ్గరే అయినా మనవాడితో ఏమాత్రం సాపత్యం కుదర్దు. వాడు సంకరం. రూపంలో కొద్దిగా దొరల వాసన అదనం. కనీసం కష్టపడి వేషం మారిస్తే దొరేనని భ్రమింపజేయగలడు. వాడికి తెలివితేటలు ఉన్నాయి. చదువు కూడా ఉంది. అన్నిటినీ మించి బానిస పని నుంచి కెనడా పారిపోవాలనే కోరిక ఉంది. విముక్తి, స్వేచ్ఛ మీద కోరిక. అందుకోసం అడ్డొచ్చిన మనుషమృగాన్ని గుండేసి పేల్చేయగల గుండె ఉంది. దెబ్బతిన్న శత్రువును ఆస్పత్రిలో చేర్పించే మనసూ ఉంది. చివరిదశలో అయినా వాడికి ప్రభువు మీద విశ్వాసమూ మళ్లుతుంది.

మన హేరిస్ సంకరం కాదు. ఈ లక్షణాల్లో ఒక్కటీ తన దరిజేరనివ్వడు. వాడి భయానికి, భక్తికి, విధేయతకు పాత్రుడు కాగల ప్రభువల్లా ఒక్కడే! వాడు తనకంటే రెండేళ్లు చిన్న అయిన, జార్జి దొర దగ్గర పనిచేస్తాడు.

అప్పట్లో ఒక సంఘటన జరిగింది. అంటే, హేరిస్‌కు బహుశా నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు.
జార్జి తండ్రి జిమ్, హేరిస్‌కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే వాణ్ని కొన్నాడు. సాధారణంగా అంత పసివయసులోని నిగ్గరు పిల్లల్ని ఏ యజమానీ కొనడు. పైగా అప్పటికే ఆ ఇంటి బానిసలకు పుట్టిన పసివాళ్లుంటే కొత్తవారిని కొనడం శుద్ధ దండగ. పనికి ఉపయోగపడని వాడికి రోజుకు పిడికెడు జొన్నలే విదిల్చాల్సి వచ్చినా... అది కూడా దండగే కదా.

బేరగాళ్లు మాత్రమే కొంటారు. తక్కువ ధరకు దొరికే పిల్లల్ని కొంచెం ఒళ్లు కాయగానే కోడెవయసు వరకు పోషిస్తే మంచి ధరకు అమ్ముకోవచ్చునని అనుకుంటారు.

నిగ్గరు పిల్లల విషయంలో సాధారణంగా అమలయ్యే సూత్రం ఇదే. జిమ్ ఇందుకు భిన్నంగా నడుచుకునే మానవాతీతుడేమీ కాదు. అతనిది అంత దయార్ర్ద హృదయమూ కాదు. అయితే తన రెండేళ్ల కొడుకు జార్జికి ఆటలాడుకునే వయసు వచ్చింది అని అతడు గుర్తించాడు. మామూలు ఆటల్తో పాటూ బొమ్మ గుర్రం ఎక్కి, గుడ్డతో చేసిన ఒక బుల్లి కొరడా పట్టుకుని అటూ ఇటూ సవారీ చేస్తున్నాడు. ఓ బానిసను పిలిచి వంగోబెట్టి, వాడి వీపు మీద గురమ్రెక్కి ।ఛళ్.. ఛళ్...* మని అదిలిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు.

అచ్చం దొరలాగే చేస్తున్నాడనుకున్నాడు జిమ్, ఆ ఆటలన్నీ చూసి. అయితే, చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడి, ఆ బుల్లి కొరడా దెబ్బలు తినడానికి ఓ నిగ్గరు కూడా ఉంటే... తన ఆటలో దొరతనం పరిపూర్ణంగా ఉట్టిపడుతుందని జిమ్‌కు అనిపించింది. అప్పుడు కొన్నాడు హేరిస్‌ను. అలా శరీరాన్ని సుతారంగా తాకే బుల్లి గుడ్డ కొరడా దెబ్బలు తింటూ, యజమాని సరదా కోసం ఆ నొప్పికి విలవిల్లాడుతున్నట్లుగా నటించడంతో వాడి జీవితం మొదలైంది. ఇప్పటికి చర్మం చీల్చే కొరడా బలంగా తాకినా, చలించని స్థితికి వచ్చాడు. యజమాని తనకు చేయి తీపుగా అనిపించినపుడల్లా పిలిచి కాసేపు కొరడా దెబ్బలు కొడుతూ, వాడి దేహాన్ని అంత దృఢంగా తీర్చాడు మరి.


ఇదంతా వేరే సంగతి.
హేరిస్‌కు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగిందని చెప్పుకున్నాం కదా

చిన్న యజమాని ఆట సవారీ వేళ దెబ్బలు తినే హేరిస్, మిగిలిన సమయాల్లో చిన్నచిన్న పనులు కూడా చేసేవాడు. ఓసారి ఏమైందంటే జిమ్ పెద్దగా దగ్గి ఉమ్మాడు. అది ఓ మూల కిటికీ పక్కగా గచ్చు మీద పడింది. హేరిస్ దాన్ని గమనించి, తుడిచేయడానికి ఇంట్లోకి వెళ్లి ఓ మురికి గుడ్డ తీసుకువచ్చాడు. ఈలోగా ఒక తమాషా జరిగింది.

ఎక్కడినుంచో ఈగ ఒకటి ఎగురుకుంటూ వచ్చి భోజనానికి కూర్చున్నట్లుగా ఆ శ్లేష్మం మీద వాలింది. అంతే, ఇక అక్కడే చిక్కుబడి పోయింది. తుడిచేయడానికి గుడ్డ తీసుకువచ్చిన వాడికి, అది వింతగా అనిపించి, ఏమౌతుందో చూద్దామని మెరిసే కళ్లతో, గమనిస్తూ కూర్చున్నాడు. ఎగిరిపోవడానికి కాసేపు రెక్కలు అలల్లార్చి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో మరింతగా దానికే అతుక్కుపోయింది. దానికి ఎగిరిపోవాలని ఉన్న కోరికను వాడు తెలుసుకున్నాడు. అయితే ।అయ్యో* అనిపించలేదు అది అలా విలవిల్లాడుతుండగా చూడ్డం వాడికి ఓ క్రీడలాగా తోచింది. కాసేపు ఆగి అది కొద్దిగా కదిలి మళ్లీ ఊరకుండిపోయింది.

చూసి చూసి హేరిస్‌కు బోరు కొట్టింది. కాసేపు అటూ ఇటూ తిరిగివచ్చి మళ్లీ చూశాడు. శ్లేష్మం తడారుతోంది. అది ఎగరలేదు. కానీ ఓసారి చిన్నగా కదిలింది. ।ఓహో! ఇంకా పూర్తిగా చావలేదన్నమాట* అనుకుని వెళ్లిపోయాడు. మధ్యాహ్నం వేళకి గుర్తొచ్చినప్పుడు వచ్చి చూస్తే అప్పటికే అక్కడ బాగా ఎండిపోయి ఉంది. అతుక్కుపోయినట్లున్న ఈగ శవం సహా! ఎందుకో తెలియదు గానీ, ఈ క్రీడ యావత్తూ వాడి పసి మనసులో ముద్రపడిపోయింది.

హేరిస్ పెరిగి పెద్దవాడయ్యాడు. జిమ్ ఉక్కు క్రమశిక్షణలో వాడు మహా కటువైన బానిసగా రాటుదేలాడు. వాడిని చూసి జిమ్‌కు గర్వంగా ఉండేది.

జిమ్ ప్రతి ఏటా ఒక రోజున బానిసల వ్యాపారులందరినీ తన ఇంటికి పిలిపించేవాడు. తెల్లవారుజామునే హేరిస్‌కు ఓ బండెడు బండచాకిరీ పని అప్పగించేవాడు. ఇక వచ్చిన వ్యాపారులకు వాణ్ని చూపిస్తూ... బ్రాందీ, వేయించిన మాంసంతో విందు చేసేవాడు. హేరిస్ చాకిరీ నిరంతరాయంగా అలా రోజంతా సాగుతూనే ఉండేది.

అలుపూ సొలుపూ ఉండేది కాదు. ఒళ్లు విరుచుకోవడానికైనా ఓ క్షణం ఆగేవాడు కాదు. ।అమ్మా* అని మూల్గి ఎరగడు. వ్యాపారులు వాడి ఒంట్లో సత్తువ చూసి విస్తుపోయేవాళ్లు. పొద్దు గుంకాక జిమ్, ఎంతో దయగా వాణ్ని పిలిచి ఇక ఆపి వెళ్లి తిని పడుకోమని, అభివాదం స్వీకరిస్తూ ఆదేశించేవాడు.

విందు వడ్డించిన మేజాల మీద దీపాలు వెలిగించిన తర్వాత వ్యాపారులతో సంభాషణ నడిచేది...

॥ఇప్పుడు చెప్పండి. ఎంత ఇవ్వగలరు?**

॥రెండు వేల డాలర్లు**

॥ఛీ** నోట్లోంచి పైపు తీసి, జిమ్ ఛీత్కారంగా ఉమ్మేవాడు.

॥ఐదువేలు**
॥ఎనిమిది**
॥నేను పదివేలు...**

మొహంలో హావభావాల జాడ దొరకనివ్వని జిమ్ నుంచి వారికి స్పందన తెలిసేది కాదు. అలా ఆ పాట మాత్రం చాలా వేల వరకు సాగేది. ఎంతవరకు అంటే... బ్రాందీ సీసాలు, మాంసం వేపుడు మొత్తం ఖాళీ అయ్యే వరకు. చివరగా జిమ్

॥మిత్రులారా! మీకు ధన్యవాదాలు. బ్రాందీ, మాంసం బాగున్నాయి. ధర రుచించలేదు. నేను అమ్మబోవడం లేదు** అని తేల్చేసేవాడు.

వాళ్లు మాత్రం బాగా తాగిన తృప్తితో ఒకటో జాతి నిగ్గరును చూసిన విషయాల్నే మాట్లాడుకుంటూ, తూలుకుంటూ తమ గురప్రు బళ్లు ఎక్కి వెళ్లిపోయేవారు. జిమ్ మాత్రం ఓసారి మీసం మెలేసుకుని, ।నా శిక్షణలో ఈ నిగ్గరువాడు బాగా రాటుదేలాడు. ఈ ఏడాది నా సంపద ఇంత విలువ చేస్తుందన్నమాట* అనుకుని నిద్రపోయేవాడు. అసలు హేరిస్‌ను అమ్మాల్సిన అవసరం గానీ, అమ్మే ఆలోచన గానీ జిమ్‌కు లేనేలేవు. ఆ వేలం పాట అతడు ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా నిర్వహించే ఓ క్రీడ. అంతే.

జిమ్, వృద్ధాప్యం సమీపించినప్పుడు చచ్చిపోయాడు. ఎందుకో తెలియదు గానీ, మృత్యువు తనంతగా తలుపు తట్టకముందే, ఒకనాడు తుపాకీతో కణతకు గురిపెట్టి కాల్చుకుని చచ్చిపోయాడు.

తర్వాత ఆ సంపద యావత్తూ జిమ్ నుంచి జార్జికి సంక్రమించింది. హేరిస్, అలాంటి ఎంతోమంది బానిసల సహా.

జార్జి తరహా వేరు. కొడుకుతో జిమ్ అతి తరచుగా అంటూ ఉండేవాడు. ।నా తదనంతరం నువ్వు నాకు మంచి పేరు తెచ్చి పెట్టాల్రా అబ్బాయ్* అని. నిగ్గరుల్తో వ్యవహారం విషయంలో మంచిగా ఉండడం అనేది అసంభవం. అదెప్పుడూ ఒకే రీతిగానే ఉండేది. అలాంటప్పుడు మరణించిన తర్వాత మంచి పేరు కొత్తగా సృష్టించడం ఎలాగన్నది మాత్రం జిమ్ ఏనాడూ వివరించిన పాపాన పోలేదు.

తండ్రి కోరిక గుర్తుంచుకుని దాన్ని ఆచరణలో పెట్టేందుకు కష్టపడేంత బలహీన మనస్కుడు కాదు జార్జి. జార్జికి తండ్రి కోరిక గుర్తు లేకపోయినా, అతని వ్యవహారం మాత్రం ఆ తరహాలోనే సాగింది. తండ్రికంటె కౄరంగా ఉండగలిగితే తండ్రే మంచి వాడని అందరూ అనుకోవడం లోకరీతి. జార్జి స్వభావసిద్ధమైన వ్యవహార సరళి జిమ్ కీర్తిని పెంచేలా ఉండేది.

జార్జి ఇంకాస్త జల్సారాయుడు. నిగ్గరు జాతి పనితనం మీద అతడికి విశ్వాసం ఇంకాస్త ఎక్కువ. పగలంతా పొలం పనులు, రాత్రి దోమల కొట్టాల్లో నిద్ర... ఇవి కాకుండా, మిగిలిపోయిన ఉదయం సాయంత్రం వేళల్లో తన బానిసలు ఖాళీగా కూర్చుంటున్నట్లు గుర్తించాడు. జొన్న రొట్టెలు కాల్చుకునే పొయ్యిల పక్కన, గురప్రుశాలల్లో నలుగురైదుగురు కూర్చుని మాట్లాడుకోవడం అతని కంటబడింది. చదువు లేదు. బాహ్యప్రపంచం ఎరగరు. వారికంటూ బంధుత్వాలూ, స్నేహాలూ లేవు. పని మినహా ఇంకే వ్యాపకమూ లేదు. మరి ఏం మాట్లాడుకుంటారు వాళ్లు ఖాళీ సమయమంతా. జార్జికి ఆశ్చర్యం వేసింది. కొంతసేపు ఆలోచించాక భయం కూడా వేసింది.

వాళ్ల మాటల్లో స్వేచ్ఛ ప్రస్తావన గనుక వస్తే?

అప్పుడప్పుడే ఉత్తరాది అమెరికా రాష్ట్రాల్లో కూడా స్వేచ్ఛ కోసం కొందరు నిగ్గర్లు కెనడా పారిపోవడం వంటి సంఘటనలు చెవినబడ్తున్నాయి. అలాంటి ప్రమాదం తలెత్తక ముందే మేలుకోవాలనుకున్నాడు. వాళ్లకు చేతినిండా పని కల్పించలేక, ఏమీ తోచక పోసికోలు కబుర్లు చెప్పుకోవాల్సి వచ్చేలా ఖాళీ సమయం దొరకనివ్వడం తన వైఫల్యంగా, తప్పిదంగా భావించాడు. పైగా, తండ్రి ఇచ్చిన సంపదను పెంచినప్పుడే తన ప్రతిభ. ఉన్నది ఉన్నట్లుగా వ్యవసాయం చేయించి, రోజులు గడిపితే తన గొప్పదనం ఏముంటుంది? ఈ ఆలోచనల్తో తన నిగ్గర్లను ఎస్టేటుకు దగ్గర్లోని ఓ ఫ్యాక్టరీలో కూలికి కుదిర్చాడు, పొలం పనికి ఆటంకం కాని షిఫ్టుల్లో.

।అలా బాహ్య ప్రపంచంలోకి వెళితే విముక్తి గురించిన మాటలు వారికి తెలియవచ్చునన్న భయం ఉండాలి కదా* అని మీకు అనిపించవచ్చు. జార్జి అంత తెలివి తక్కువ వాడేమీ కాదు. ఆ ఫ్యాక్టరీ యజమాని గురించి ముందే సర్వం ఆరా తీశాడు. అతడు తనకంటె గట్టివాడు. ఫ్యాక్టరీ మోటారు బండి ఎస్టేటు వద్దకు వచ్చి నిగ్గర్లను ఎక్కించుకు వెళ్లేది. తీసుకొచ్చి దింపేది. బండి ఎక్కిన దగ్గర్నుంచీ దిగేవరకు ఏ ఇద్దరు నిగ్గర్లు కనీసం పలకరించుకున్నా... ఒళ్లు చీరేసేవాళ్లు. ఇక స్వేచ్ఛ మాటలకు సందు ఎక్కడిది? వారి పనికి చెందిన కూలీ సొమ్ము మాత్రం యథారీతిగా జార్జికి అందేది.

హేరిస్‌ను మాత్రం ఫ్యాక్టరీ పనికి పంపలేదు. జార్జి ఆలోచన వేరు. హేరిస్ ఎంత గొప్ప పనిమంతుడో, బానిసో వేరొకరికి తెలియడం అతడికి ఇష్టం లేదు. ఏమో. ఏ క్షణాన పరిస్థితులు ఎలా మారుతాయో? వాస్తవం ఒక్కోసారి ఎంతో విభిన్నంగా ఉండవచ్చు, భవిష్యత్ సంభావ్యతల గురించి మనం చేయగల అన్ని రకాల ఊహలకంటె. అందుకే అతడు... తండ్రి ప్రతి ఏటా కొనసాగించే ।హేరిస్ వేలంపాట*ల్ని తన హయాంలో పూర్తిగా నిలిపేశాడు. అలాంటి జార్జి, అందరూ ముక్కున వేలేసుకునేంతటి హేరిస్ పనితనం నలుగురికీ తెలిసేలా బయటిపనికి పంపేంతటి మూర్ఖుడు కాదు.

జార్జికి హేరిస్ పట్ల అవ్యాజమైన ద్వేషమూ, అసూయ, ఎందుకో తెలియని కసి, కొద్దిగా సానుకూల దృక్పథం కలగలసి ఉండేవి. తనకంటె, తనూహించనంత బలమైనవాడు కావడం, ఏ క్షణాన పారిపోతాడోనని తనను నిత్యం ఆందోళనకు గురిచేస్తుండడం, అకారణంగా దండించి తీవ్రంగా హింసించినా కిక్కురుమనకుండా పడి ఉండడం... హేరిస్ పట్ల మొదటి మూడు భావాలకి మూలాలు. అవును మరి హింసించేవాడికి బాధను చూసినప్పుడే తృప్తి.

అవి అంతర్లీనంగా, పరోక్షంగా, అతడికే తెలియకుండా అతణ్ని మథన పెడుతుండేవి. ఇకపోతే, హేరిస్‌ను చంపితే అలాంటి వాడు ఇక జన్మలో దొరకడన్న భయం ఒక్కటే వాడి పట్ల చివరిదైన సానుకూల దృక్పథాన్ని బతికిస్తూ ఉండేది. హేరిస్ పట్ల జార్జి ప్రవర్తన అందుకే, ఎంతో విచిత్రంగా, విలక్షణంగా ఉండేది. వాణ్ని ఇంట్లో ఉంచుకుని, తనకు తోచినప్పుడల్లా పిలిచి కొరడాతో నాలుగు దెబ్బలు కొట్టేవాడు. అకారణంగా శిక్షించాననే రాక్షస సంతృప్తి పొందుతూ, కొట్టినా వాడు బాధపడలేదనే విచారం మధ్య విరమించుకునే వాడు.

హేరిస్ నికార్సయిన నిగ్గరు. జార్జి వాడికి ప్రభువు. జార్జి తిట్టే తిట్లే వాడికి పవిత్ర వాక్యాలు. మరొకటిగా ఎంచడు.
హేరిస్ అభావంగా ఉండేవాడు. బాధానందాల స్పందనలు వాడి మొహంలో తెలిసేవి కాదు. బహుశా ఆనందించే సందర్భం వాడికి తటస్థపడి ఉండకపోవచ్చు కూడా. వాడికి ఓ నిగ్గరు పిల్లతోనే పెళ్లి కూడా జరిగింది. నిగ్గర్లకు ఓ వీనస్ ఉంటే ఆ పిల్లలా ఉండేదేమో. వారికి ఓ కొడుకు కూడా పుట్టాడు. ఓసారి గురప్రు బండిపై వచ్చిన జార్జి అతిథికి విందుభోజనం వడ్డించే పని ఆ పిల్లపై పడింది.

మర్రోజు ఉదయం ఆ అతిథి విక్రయపత్రం రాయించుకుని దాన్ని వెంటబెట్టుకుని వెళ్లిపోయాడు. ధర్మం కాదు గనుక పసిబిడ్డను తల్లినుంచి వేరుచేయకుండా వెంట పంపేశారు. ఆ సందర్భంలో కూడా హేరిస్‌లో ఎవరూ దుఃఖాన్ని చూడలేకపోయారు. ఎప్పటిలాగానే బానిసగానే ఉండిపోయాడు. బంధాన్ని, బాధని ఏనాడూ ఎంచలేకపోయిన వాడికి స్వేచ్ఛ, విముక్తి గురించిన ఆలోచన ఎప్పుడైనా వచ్చిందో లేదో కూడా ఎవరికీ తెలియదు.

॥వాడు బాగా బ్రాందీ తాగి, మరో రెండు రోజుల వరకు లేవలేడన్నట్లుగా ... పీనుగులాగా నిద్రపోతున్నాడు**
జేమ్స్ వచ్చి చెప్పాడు. ఆ మాటలు జార్జి గురించేనని హేరిస్‌కు అర్థమైంది.

॥ఇవాళ చాలా మంచి రోజు. అందుకే నేనే దగ్గరుండి ఓ కుండెడు తాగించాను. ...కొడుక్కి** ఓ బూతు వాడాడు. ॥ఇప్పుడు మనం తప్పించుకోవచ్చు. పోదాం పద.**

హేరిస్ ఆ సమయంలో తన కొట్టంలో కూర్చుని చీకటిలో తనని కుట్టి బాధించడానికి ప్రయత్నించి విఫలమవుతున్న దోమల్ని సరదాగా చంపుతున్నాడు, చీకట్లో అతడి దేహం అతడికే కనిపించకపోయినా! ఆ వేళలో అక్కడికి వచ్చాడు జేమ్స్.

జేమ్స్ అంటే జార్జి ఎస్టేటులో హేరిస్ సహబానిస. ఫ్యాక్టరీ కూలికి వెళ్లిన వారిలో ఒకడు. ఎన్నడూ ఆ విషయం మాట్లాడకపోయినా స్వేచ్ఛ అంటే ఇచ్ఛ ఉన్నవాడు. అందుకు ఇప్పుడు మార్గం కనిపెట్టినట్లుగా ఆశగా హేరిస్‌తో అన్నాడు. హేరిస్ అసలు సిసలు నిగ్గరుతనం అతణ్ని మాట్లాడనివ్వలేదు. సంశయిస్తున్నాడేమో అనుకుని జేమ్స్ మరింత ఆశ పుట్టించేలా చెప్పాడు...

॥ఏ ప్రమాదమూ ఎదురవదు... సునాయాసంగా కెనడా వెళ్లే ఉపాయం కనిపెట్టాను. వీడు లేచేలోగా మనం బహుశా అక్కడ ఉంటాం**
॥నేను రాలేను**
॥ఏం?**

॥నేను జార్జి ప్రభువు కుటుంబ ఆస్తిని. బుల్లి జిమ్ దొర కొరడాతో ఎలా కొట్టగలడో నేను చూడాల్సి ఉంది. నేర్పాల్సి ఉంది.** హేరిస్ నిర్వికారంగా సమాధానం ఇచ్చాడు.
॥థూ...** చీకట్లో ఎవ్వరి ఆకారాలూ స్పష్టంగా కనిపించకపోయినా, జేమ్స్ కాండ్రించి ఉమ్మిన ఉమ్ము హేరిస్ మొహం మీద పడినట్లుగా ।తప్* మని చిత్రమైన చప్పుడు వచ్చింది. తుడుచుకున్నాడో... తడుముకుని అలవాటుగా ఉపేక్షించాడో..
కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది.

అంతకంటె చిత్రంగా వెక్కిళ్లు వినిపించాయి. జేమ్స్‌కు ఆశ్చర్యం అనిపించింది. ఎన్నేళ్లుగా చూస్తున్నాడు? వీడిలో కూడా స్పందనలున్నాయా?

॥చెప్పుకోకపోవచ్చు. స్వేచ్ఛ కోరుకోని నిగ్గరు బతుకుండదు** ఏడుపులో కలిసి మాటలు ముద్దగా వస్తున్నాయి.
॥మరిక ఏం?**

॥ఎగిరే ప్రయత్నం జరిగే కొద్దీ మరింతగా అతుక్కుపోతాం...** నాలుగేళ్ల వయసప్పుడు మనోఫలకం మీద పడిన ముద్ర పలికించినట్లుగా, ట్రాన్‌‌సలోంచి ఆ మాటలొచ్చాయి.
॥చేతకాని మాటలొద్దు...**
॥పరిస్థితి ఇంతకంటె ఘోరంగా ఉంటుందని భయం**
॥నీ నల్లటి తోలును నిలువునా వలిస్తే తప్ప ఇంతకంటె ఘోరమైన పరిస్థితి వస్తుందనుకోను** జేమ్స్ వెటకారానికి హేరిస్ నుంచి సమాధానం రాలేదు. జేమ్స్ బరువైన అడుగుల చప్పుడు క్రమంగా దూరం అవడం మాత్రం హేరిస్ విన్నాడు.

కాసేపటికి
।ఈ వేళప్పుడు నా గదిలో ఏం చేస్తున్నావ్* లీలగా వినిపించింది, బంగళాలోంచి. ।హబ్బా..* అని బాధ కలిసిన పొలికేక. ఆ మాటలు, కేక రెండూ జార్జివి.

మళ్లీ నిశ్శబ్దం. ఏం జరుగుతోంది?

జేమ్స్ అడుగులు మళ్లీ వచ్చేశాయి. వెంట తెచ్చిన ఓ కొవ్వొత్తిని వెలిగించి అక్కడ ఉంచాడు.

ఓ చేతిలో కొన్ని కాగితాలు. మరో చేతిలో, కొవ్వొత్తి కాంతిలో మెరుస్తున్న కత్తి. దాన్నిండా తడి ఆరని రక్తం.

॥ఇక దిగుల్లేదు, పద** ఎడమ చేతిలోని కాగితాల వంక మెరిసే కళ్లతో చూస్తూ జేమ్స్ అన్నాడు.
॥ఏం జరిగింది?**

॥ఇవి స్వేచ్ఛాపత్రాలు. మనందరివీ. ముందే సిద్ధం చేయించాను. బాగా తాగాడుగా. మంచి నిద్రలో ఉన్నాడు. లేపగానే అరిచాడు. ఎడమ చేయి నరికేశాను. కేకపెట్టాడు. సంతకాలు పెట్టమన్నాను. కుడిచేత్తో సంతకాలు పెట్టాడు. ఆ పని అయిపోయాక వాడి ప్రాణంతో మనకు పనేం ఉంది గనుక.** అదోమాదిరిగా నవ్వాడు.

అంతసేపూ తదేకంగా మెరిసే కత్తినే చూస్తున్న హేరిస్ సంభ్రమంగా అన్నాడు ॥అయ్యో అయితే, ఇది ప్రభువు రక్తం...**

॥...** ఆ నిశ్శబ్దం చీకటికి మరిన్ని భావాల్ని పులుముతోంది. ఒక అనల్పమైన సంతృప్తిని, ఒక అకారణమైన భయవిహ్వలతని. నిశ్శబ్దం కొనసాగేకొద్దీ బలపడుతున్న ఆ భావాల గాఢతను భంగపరుస్తూ హేరిస్ పెదవి విప్పాడు.

॥నా రక్తం లాగానే ఉందేమిటి?**

॥భలె కనుగొన్నావే మిత్రమా... నోర్మూసుకుని పద!**
॥నేను రాలేను** ఆ స్వరంలో అచ్చమైన నిగ్గరుతనం స్థిరంగా పలికింది.
॥నువ్వే అన్నావ్‌గా... స్వేచ్ఛ కోరుకోని నిగ్గరు బతు..**
॥మళ్లీ అన్నానుగా. ఎలాగో ఎరగను గానీ, ఎగరలేనంతగా అతుక్కుపోయాను. ఉన్నది నచ్చిందని కాదు. నచ్చేది దొరుకుతుందనే నమ్మకం లేదు. ఉండాలని లేదు. అలాగని, పోలేను.** నిగ్గరు హేరిస్ మాటలు ఇంకా పూర్తి కానే లేదు.

॥నేన్నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాను**
ఎక్కువ సమయం తీసుకోకుండానే ఒక నిర్ణయానికి వచ్చినట్లు జేమ్స్ పలికాడు. అసలే మొండివాడైన జేమ్స్.

॥...** ఆ నిశ్శబ్దం గాఢతలో చిక్కబడిపోయిన భావాలకు ముగింపు పలికేలా ఉంది.
జేమ్స్ ఒక్క ఉదుటున ఆ కత్తిని, ఆ నిగ్గరు హేరిస్ గొంతులో పాతేశాడు. ఆ కళ్లు చూస్తుండగానే... తిరిగి వెనక్కు తీసుకోకుండానే వెళ్లిపోయాడు.

కత్తి చేసిన దారిలోంచి ప్రభువు రక్తం నెమ్మదిగా జారి, వెచ్చగా ఉబికివస్తున్న నిగ్గరు రక్తంతో కలిసిపోయింది. ప్రళయం రాలేదు. భూకంపం పుట్టలేదు. సృష్టి తిరగబడలేదు. రెండూ ఒకటే అన్నట్లుగా కలిసిపోయాయి.

దోమలకొట్టాల్లో ఒక్కసారిగా పెద్ద కలకలం రేగింది.

కొవ్వొత్తుల దీపాలు వెలిగాయి.
(మరణించిన పాత్రికేయుడు యస్.యమ్.గౌస్‌కు, ఇంకా మరణించని మరికొందరు మిత్రులకు)

కె.ఎ. మునిసురేష్ పిళ్లె


Pasted from http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2FWeeklyDetails.aspx%3FNewsid=5066%26Categoryid=10%26subcatid=33